![]() |
మనిషిగా సాగనివ్వండి..... |
మల్లెల మబ్బులతో దోబూచులాడి
అనంత వాయువులో తేలియాడి
విహరించే నన్ను
ఈ నేలకు లాగిన దెవ్వరు?
ఈ ఊబిలోకి తోసింది ఎవరు ?
నా విమానం నేలను తాకగానే
నా చుట్టూ కాపలా
దారి పొడుగునా మార్గ నిర్దేశకులు
భుజం మీద కండువా
ఒకటా, రెండా ఎన్నెన్నో!
కుల మత నామధేయపు కండువాలు!
బయట ఇరువైపులా కంచె
కళ్ళకు గంతలు
అటూ ఇటూ చూడనివ్వని ప్రయాణం
ఇవి నేను భరించలేను
ఈ గంతలు తీసేయండి
కంచెలు తీసేయండి
నా కండువాలు తీసేయండి
నాకు, లోకం చూడాలని వుంది .
బీడు భూములకు వాన చినుకునై
శిశిర కాలపు లతలకు వసంతానినై
ఆషాఢ మాసపు కరి మబ్బులకు
దరహాస చంద్రికనై
సాగాలని ఉంది
చివరికి అలసి సొలసి అడుగులు తడ బడి
భూమిలో పడి నిదురించే వేళ
నాకు తెలుసు--
కాపలా ఉండదు, కండువాలు ఉండవు
మార్గ నిర్దేశకులూ ఉండరు
నా పక్కన నాకు తోడై
నాతో పడి ఉండేది
నాలాంటి నగ్న మనిషి మాత్రం
అందుకే నన్ను
మనిషిగా సాగనివ్వండి
...................................ఎల్ .ఆర్.స్వామి
"నవ్య" వర పత్రికలో ముద్రితమైన కవిత