![]() |
అగ్ని చుంబనం |
చెడు చూడొద్దన్నారు
ఇక చూసే దేముంది ?
చూడటం మానేసాను
ఇక వినేదేముంది ?
వినటం మానేసాను
చూపు వినికిడి లేని మనిషి
మూగవాడు కావటం సహజం
అందుకే, నాకిప్పుడు పెదవి పెగలటంలేదు
మనసు నిద్రలో ఉంది, మొద్దు నిద్రలో ఉంది
స్పందన లేదు, చనిపోతున్నాను.
బీతవారిన పుడమి పెదవిని
ముద్దాడే తోలి చినుకులు
పక్కలోని ప్రియురాలి బుగ్గపై
విరిసే లేలేత గులాబీలు
పసిపాప పెదవుల పైన జాజిపూలు
భూమి గర్భం చీల్చి లేచే
విత్తనపు పసి పాదాలు
బాంబులను బలైన నేస్తాలు
వాన, నెత్తుటి వాన
గండిపడిన జీవితాల కన్నీటి వరదలు
ఏవీ నన్ను కదిలించావు
నిద్రలో ఉన్నాను , మోహ నిద్రలో ఉన్నాను
ధనకనక వస్తు వాహనాల పద్మవ్యూహంలో
మౌన నిద్రలో ఉన్నాను , కోన ఊపిరితో ఉన్నాను
నన్ను బ్రతికించండి
ఒక అగ్ని చుంబన మిచ్చి బ్రతికించండి
అగ్ని చుమ్బనమంటే
అమావాస్య చీకటిలో క్షణిక విలువిచ్చే
మతాబుల చుంబనం కాదు
పుట్ట్టలోని నాగుపాము బెదరని
తాటాకు టపాకాయల చుంబనం కాదు
వేల వేల టన్నుల టి.ఎం.టి ల విస్పోటనం కావాలి
నేను మేలుకొనే అగ్ని చుంబనం కావాలి
ప్రపంచం మేలుకొనే అగ్ని చుంబనం కావాలి